ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళను ఒక్కరే రేప్ చేయలేరు.. ముగ్గురు, నలుగురు కలిస్తేనే చేస్తారు: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

national |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 10:39 PM

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకో వివాదం ఆ పార్టీని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, జేడీఎస్ తీవ్ర విమర్శలు చేస్తుండగా.. తాజాగా ఓ కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ఒక మహిళపై ఒక్కడే వ్యక్తి రేప్ చేయడం అసాధ్యమని.. ముగ్గురు, నలుగురు వ్యక్తులు కలిస్తేనే అత్యాచారం చేయగలరని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. తన అనుచరుడిపై ఓ అత్యాచార బాధితురాలు చేసిన ఫిర్యాదుపై ఆ మాజీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.


అయితే ఆ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆయన వద్దకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ ఆ మాజీ ఎమ్మెల్యేను సాయం కోరింది. అయితే ఆమెపై నోరుపారేసుకున్న మాజీ ఎమ్మెల్యే.. ఒక్క వ్యక్తి రేప్‌ చేయడం ఎలా సాధ్యమవుతుంది.. కనీసం ముగ్గురు, నలుగురు వ్యక్తులు కలిసే చేయగలరని తీవ్రంగా ఆ మహిళను అవమానించారు. ఆపై తప్పుడు కేసు పెడుతున్నావ్‌ అంటూ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఆ ఘటనకు చెందిన ఒక ఆడియో క్లిప్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.


కొప్పల్‌ జిల్లాకు చెందిన ఓ మహిళపై.. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అమరెగౌడ పాటిల్‌ అనుచరుడు సంగనగౌడ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సంగనగౌడపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలి కుటుంబం ఆ మాజీ ఎమ్మెల్యే అమరెగౌడను కోరింది. దీంతో అమరెగౌడతో బాధితురాలి మామ ఫోన్లో మాట్లాడగా.. ఆయన తీవ్రంగా అవమానించారు. ఆ మహిళపై రేప్‌ జరిగిందని చెబుతున్నారని.. అయితే ఒక్కడే ఆమెపై ఎలా అత్యాచారం చేయగలడని.. అది అసాధ్యమని అమరెగౌడ పేర్కొన్నారు. కనీసం ముగ్గురు నలుగురు కలిస్తేనే అత్యాచారం చేయగలరని.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బెదిరింపులకు దిగారు. ఈ విషయం చాలా సున్నిత అంశమని.. అత్యాచారం జరిగిందని చెబితే కుటుంబ పరువు పోతుందని పేర్కొన్నారు. కాదని కేసు పెడితే నిందితుడిని జైలుకు పంపుతారు దాని వల్ల మీకు వచ్చేది ఏంటి అని చెప్పడం ఆ ఆడియోలో వినిపించింది.


ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కన్నడ రాజకీయాల్లో తీవ్ర వివాదంగా మారింది. సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరెగౌడపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై స్పందించేందుకు అమరెగౌడ పాటిల్‌ నిరాకరించడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com