పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉగ్ర ఘటనలకు కారణం అవుతున్నాయి. ఇక ఉగ్రవాదులకు, ఉగ్ర సంస్థలకు ఆతిథ్యం ఇస్తున్న పాక్.. అదే ఉగ్రవాదానికి బలి అవుతోంది. పాక్‌లో ఆశ్రయం పొందుతూ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు.. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైపై చేసిన దాడి ఇప్పటికీ దేశ ప్రజలకు కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఆ ఘటన జరిగి 15 ఏళ్లు పూర్తి కావస్తున్నా దాని గాయాలు ఇంకా మానిపోలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆ విషయాన్ని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది.
లష్కరే తోయిబాను ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ఎంబసీ తెలిపింది. అయితే దీని గురించి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థన రాకపోయినా.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. దానికి సంబంధించిన అధికారిక ప్రక్రియను కూడా పూర్తి చేశామని పేర్కొంది. లష్కరే తోయిబా అనేది ఒక భయానక ఉగ్ర సంస్థ అని.. ముంబైలో దాడులు చేసి భారత పౌరులతో పాటు వందలాది మందిని పొట్టనపెట్టుకున్నారని చెప్పింది. 2008లో జరిగిన ఈ ఉగ్ర దాడికి సంబంధించిన గాయాలు ఇంకా మన గుండెల్లో ఉన్నాయని ఇజ్రాయెల్ ఎంబసీ పేర్కొంది.
అయితే హమాస్ ఉగ్రవాదులతో ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది. అయితే హమాస్ గ్రూప్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని ఇటీవల ఇజ్రాయెల్ రాయబారి భారత్‌ను కోరగా.. ఆ తర్వాత కొన్ని రోజులకే లష్కరే తోయిబాను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకోవడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
2008 నవంబర్ 26 వ తేదీ సాయంత్రం కొలాబా సముద్రతీరం నుంచి ముంబైలోకి చొరబడిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. ఆ తర్వాత నగరమంతా విస్తరించారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్, తాజ్ హోటల్, నారిమన్ లైట్ హౌస్ వంటి రద్దీగా ఉన్న ప్రాంతాలకు చేరారు. అనంతరం 12 చోట్ల ఒకేసారి బాంబుల మోత మోగించారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మృతుల్లో భారతీయులతో పాటు మరో 14 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. ఇందులో నలుగురు ఇజ్రాయెల్ పౌరులున్నారు.