సింప్లిసిటీ, సాదాసీదా జీవితాన్ని ఇష్టపడే ఓ కోడలు.. వస్త్రధారణ విషయంలో అత్తమామల తీరును వ్యతిరేకించింది. మోడ్రన్ అత్త తనను జీన్స్, టీ-షర్ట్‌లు వేసుకోవాలని బలవంతం చేస్తే.. ఆమె మాత్రం తనకు చీరలే ఇష్టమని తెగేసి చెప్పింది. దీంతో తన తల్లిదండ్రులకు ఎదురుచెబుతావా? అంటూ భర్త అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఆమెను ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన తనను మోడ్రన్ దుస్తులు వేసుకోవాలని వేధిస్తున్నారని ఆమె వాపోయింది. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. హరిపర్వత్‌కి చెందిన యువకుడికి.. ఎత్మాద్‌పూర్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఏడాది కిందట వివాహం జరిగింది. యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన ఆ యువకుడి తల్లి.. జీన్స్ వేసుకుని మోడ్రన్‌గా ఉంటుంది. కోడలు కూడా తనలాంటి దుస్తులు ధరించాలని పట్టుబట్టింది. అయితే, తనకు జీన్స్, టీ షర్ట్స్ ఇష్టం ఉండదని, చీరలే కట్టుకుంటానని చెప్పింది. భర్త కూడా తల్లి మాటకు వత్తాసు పలుకుతూ జీన్స్ కొనుక్కొచ్చాడు.
ఈ విషయమై అత్తాకోడళ్ల మధ్య గొడవ జరగడంతో భార్యపై యువకుడు చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఫ్యామిలీ కౌన్సలింగ్ సెంటర్‌కు పోలీసులు పంపారు. ఆదివారం కౌన్సెలర్ ఇరువర్గాలను పిలిచి, కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ రాజీ కుదరలేదు. దీంతో మరోసారి వారిని రావాలని కోరారు. సయోధ్య కుదిర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఏసీపీ సుకన్య శర్మ మాట్లాడుతూ.. ‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను.. నాకు జీన్స్ వేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం నా భర్తకు చెబితే తిరిగి నన్నే కొడుతున్నారు’ అని కోడలు ఫిర్యాదు చేసింది చెప్పారు.