వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ సీబీఐ దర్యాప్తు జరపాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేశారు. ప్రభుత్వం తరుపున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకుండానే పర్సనల్ ఇంటెన్షన్‌తో పిటిషన్ వేశారని, అసలు ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా ప్రభుత్వ అవినీతి అంటూ మీడియాలో రఘురామకృష్ణంరాజు మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణంరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపించారు. పిటిషన్ వెయ్యగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. అయితే మధ్యలో అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుంటూ పిల్‌పై విచారణ అర్హత లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ అర్హత ఉందని మురళీధర్ రావు వాదనలు వినిపించారు. దీంతో పిటిషన్‌పై విచారణ చేపడతామని హైకోర్టు తేల్చి చెప్పింది. అసలు ఇందులో ఉన్నతాధికారులు ఉండటంతో అందరికీ నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకుందామని ధర్మాసనం పేర్కొంది. పిల్‌లో ప్రతి వాదులుగా వున్న 46 మందికి నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ మేరకు వాయిదా వేసింది.