దేశంలో డీప్‌ఫేక్ వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సైతం స్పందించారు. ఈ నేపథ్యంలో మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు నడుం బిగించింది. ఇందుకు సంబంధించి నిబంధనల ముసాయిదాను కొద్ది వారాల్లోనే సిద్ధం చేయనున్నట్టు కేంద్ర ఐటీ సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ అంశంపై చర్చించేందుకు సోషల్ మీడియా సంస్థల అధికారులతో గురువారం, శుక్రవారం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. డీప్‌ఫేక్ ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా పరిణమించిందని చెప్పారు. రైల్‌భవన్‌లో జరగనున్న సమావేశంలో డీప్‌ఫేక్ వీడియోలపై ప్రధానంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. డీప్‌ఫేక్‌లను ఎలా గుర్తించవచ్చు; వాటిని పోస్ట్ చేయకుండా వ్యక్తులను ఎలా నిరోధించవచ్చు.. అలాంటి కంటెంట్ వైరల్‌గా మారకుండా ఆపగలమా? రిపోర్టింగ్ మెకానిజం ఎలా అమలు చేయాలి అనే అంశాలపై చర్చించనున్నట్టు మంత్రి వివరించారు. ‘ఏదైనా యాప్ లేదా వెబ్‌సైట్‌లోని వినియోగదారులు డీప్‌ఫేక్ గురించి ప్లాట్‌ఫారమ్‌ను, అధికారులను హెచ్చరిస్తారు. తద్వారా చర్య తీసుకోవచ్చు; ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ప్రభుత్వం, పరిశ్రమలు, మీడియా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు.
అటువంటి కంటెంట్ కోసం కొత్త నిబంధనలు అవసరమని చర్చల ద్వారా స్పష్టమైందని వైష్ణవ్ అన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని, మరికొన్ని వారాల్లో నిబంధనల రూపకల్పనను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. అలాగే దీనికోసం ఫ్రేమ్‌వర్క్‌ను కూడా రూపొందిస్తామని స్పష్టం చేశారు.