కర్నూలు మెడికల్ కాలేజీ హాస్టల్‌లో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి.సుధాకర్ తెలిపారు. త్రిసభ్య కమిటీ విచారణ మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులను శాశ్వతంగా, మరో ఐదుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు బహిష్కరించినట్లు పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులు మత్తుపదార్థాలకు బానిసైనట్లు గుర్తించామన్నారు. పోలీసు విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కర్నూలు మెడికల్ కళాశాల మెన్స్ హాస్టల్‌లో గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. మెడికోలు ఇటీవల మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ నెల 17, 18వ తేదీల్లో హాస్టల్ డిప్యూటీ వార్డెన్, అసిస్టెంట్ వార్డెన్‌లు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ గదిలో నలుగురు వైద్య విద్యార్థులు మద్యం సేవిస్తూ గంజాయి తాగుతూ కనిపించారు. గంజాయిని పొడిచేసి దాన్ని పొగ రూపంలో తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు.
గంజాయి ఘటన వెలుగులోకి రావడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించిన ప్రిన్సిపాల్, అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.ప్రిన్సిపల్ ముగ్గురితో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సభ్యులు మెన్స్ హాస్టల్‌లో విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు ఇచ్చారంటూ విద్యార్థులను ప్రశ్నించారు.