ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ డాక్యుమెంట్లను చంద్రబాబుకు ఇవ్వండి.. ఏపీ హైకోర్టు కీలక సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 08:23 PM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యం, ఇసుక కేసుల్లో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి చేశారు. సీఐడీ అభియోగాలపై ఆధారాలు లేవని.. రాజకీయ కక్షతోనే వరుస కేసులు నమోదు చేస్తున్నారంటూ వాదించారు. 17 - ఏ నిబంధన చంద్రబాబుకు వర్తిస్తుందని.. అభియోగాలు నమోదుకు గవర్నర్‌ అనుమతి తీసుకోలేదన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని క్రిమినల్ కేసు ద్వారా విచారణ జరపకూడదన్నారు. ఉచితంగా ఇసుకను ఇచ్చారు కాబట్టి ఖజానాకు నష్టం జరిగిందని అనడానికి వీల్లేదన్నారు. అది ప్రభుత్వ నిర్ణయం, సామాన్యులకు మేలు చేయాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయంగానే చూడాలని కోరారు.


ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేందుకు ఏముంటుందని ప్రశ్నించారు. ఉచిత ఇసుక అనేది ఏవిధంగానూ చట్ట విరుద్ధం కాదని వాదించారు. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేదలకు, భవన నిర్మాణ పనులకు అందుబాటులో ఉండేలా అప్పటి ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఈ విధాన పరమైన నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు. ఇసుకను ఇతరులకు విక్రయించడానికి అనుమతించలేదని.. నిర్మాణ అవసరాలకే వినియోగించాలనడంతో రాజకీయ జోక్యం లేకుండా పోయిందన్నారు. మధ్యవర్తుల ప్రస్తావనే లేదని.. గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయగలిగారన్నారు.


పర్యావరణ అనుమతులు పొందిన ఇసుక రేవులలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చారన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపును నిషేధించారన్నారు. అని తెలిపారు. చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారని.. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన సొమ్మును కాదనుకొని సాధారణ ప్రజల ప్రయోజనం కోసం ఉచిత ఇసుక ఇవ్వడం ఎలా తప్పవుతుందన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌.. కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిన ఆ కమిటీ ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చింది అన్నారు. సీఐడీ ఆ విషయాన్ని దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తోందన్నారు.


కొంతమంది ప్రయోజనం కోసమే ఉచిత ఇసుక విధాన నిర్ణయాన్ని తీసుకున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ విధానం వల్ల ఎవరూ వ్యక్తిగత లబ్ధి పొందలేదన్నారు. 2016 మార్చి నుంచి 2019 సెప్టెంబరు వరకు ఉచిత ఇసుక విధానం అమలులో ఉందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 2019 మేలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఉచిత ఇసుక విధానాన్నే సెప్టెంబరు వరకు కొనసాగించింది అన్నారు. అందులో లోపాలుంటే అప్పుడే ఎందుకు కేసు పెట్టలేదని.. ఏడేళ్ల తర్వాత చేసిన ఫిర్యాదు చెల్లదన్నారు. ఇన్నేళ్ల జాప్యానికి కారణమేంటో కూడా పేర్కొనలేదన్నారు.


మరోవైపు చంద్రబాబు పబ్లిక్ సర్వెంట్‌గా ఉంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని మద్యం కేసులో సీఐడీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయానికి విరుద్ధంగా విధాన నిర్ణయం తీసుకున్నారని.. దాని వల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందన్నారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం వెళ్లాలి లేదా సవరించి ముందుకు వెళ్లాలని.. అలా కాకుండా వెళ్తే అవినీతి విస్తృతం అవుతుందన్నారు. ఎక్సైజ్ పాలసీనీ 5 నుంచి 10 శాతానికి ఉద్దేశ పూర్వకంగా మార్చారని.. కొంతమందికే లబ్ధి కలిగేలా మార్పులు చేసి లైసెన్స్ ఇచ్చారని వాదించారు.


ప్రివిలేజ్‌ రుసుము విధించడంతో 2014-15 సంవత్సరాలలో మద్యం అమ్మకాలు తగ్గాయని కోర్టు దృష్టికి తెచ్చారు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది నాగముత్తు. దీంతో 2015-17 సంవత్సరాలకు ప్రివిలేజ్‌ ఫీజును తొలగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ వ్యవహారాన్ని కాగ్‌ నివేదిక సైతం నిర్ధారించిందన్నారు. అలాగే మద్యం కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలకు కోర్టు ముందు ఉంచిన డాక్యుమెంట్లను అందజేయాలని సీఐడీ తరఫున ప్రతివాదనలు వినిపిస్తున్న ఏజీ శ్రీరామ్‌కు హైకోర్టు సూచించింది. ఆ డాక్యుమెంట్లు రహస్యమైనవి కాదని వ్యాఖ్యానించింది. ఏజీ వాదనల కొనసాగింపు కోసం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com