తిరుమలతో పాటూ తిరుపతిలో ఆహ్లాదరకరమైన వాతావరణం కనిపిస్తోంది. సరికొత్త అనుభూతితో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సుప్రభాత సేవ సమయంలో కొండపై సన్నిధి, ఆలయ పరిసర ప్రాంతాలు ప్రత్యేక అనుభూతిని ఇస్తున్నాయి. గురువారం ఉదయం చిరుజల్లులతో పాటుగా మేఠాలు అలా తరలి వస్తుంటే.. అటు శేషాచల లోయల్లో మంచు దుప్పటిలా శంకుచక్ర నామాల గోపురం వైపుగా కనిపంచాయి. భక్తులు అలా చిరుజల్లులు, వర్షపు నీటిలోనే స్వామివారి దర్శనం పూర్తిచేసుకుని ఆనందంతో బయటకు వస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి సరికొత్త అనుభూతిని పొందుతున్నారు.
మరోవైపు తిరుమలలో వారాంతం వస్తుండటంతో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు 15 గంటల సమయం పడుతోంది. కానీ గురువారం మాత్రం రద్దీ తగ్గింది. నిన్న శ్రీవారిని చాలా తక్కువ మంది దర్శించుకున్నారు. రోజూ 60 వేలకు పైనే భక్తులు దర్శించుకుంటుండగా.. గురువారం 45,503 మంది మాత్రమే భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 22,096మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ తలపెట్టిన కార్యక్రమాల్లో మొదటగా విష్ణుసాలగ్రామ పూజ తిరుమల వసంత మండపంలో ఆగమోక్తంగా జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ముందుగా ప్రార్థనా సూక్తం, అష్టదిక్పాలక ప్రార్థన, నవగ్రహ ప్రార్థనతో విష్ణుసాలగ్రామ పూజను ప్రారంభించారు. అనంతరం వేదపండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా అర్చకులు సాలగ్రామాలకు పాలు, పెరుగు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, సాలగ్రామాలకు హారతులు సమర్పించారు. నైవేద్యం సమర్పించిన అనంతరం క్షమా మంత్రం, మంగళంతో ఈ పూజ ముగిసింది. ఈ సందర్భంగా పురాణ పండితులు శ్రీ రామకృష్ణ శేషసాయి మాట్లాడుతూ సాలగ్రామాలు సాక్షాత్తు విష్ణువు అవతారమని, సాలగ్రామ పూజ వల్ల సర్వజన రక్షణ, సమస్త బాధల ఉపశమనం కలుగుతాయని తెలిపారు. సాలగ్రామాలకు చేసిన అభిషేక తీర్థాన్ని సేవిస్తే సమస్త పాపాలు తొలగి, సర్వవ్యాధులు నివారించబడతాయన్నారు. అంతేకాదు తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27వ తేదీన (సోమవారం) పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కావున నవంబరు 26వ తేదీన(ఆదివారం) సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా కోరారు.