ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూఢిల్లీలోని అప్ఘానిస్థాన్ ఎంబసీ శాశ్వతంగా క్లోజ్.. భారత ప్రభుత్వ వైఖరే కారణమని ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 11:36 PM

న్యూఢిల్లీలోని దౌత్య కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు అప్ఘానిస్థాన్ ఎంబసీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుంచి నిత్యం సవాళ్లు ఎదురవుతోన్న నేపథ్యంలో డిప్లొమాటిక్ మిషన్‌ను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. నవంబర్ 23 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30నే అప్ఘాన్ ఎంబసీ కార్యకలాపాలను నిలిపేసింది. అప్ఘాన్ దౌత్య అధికారులు ఇతర దేశాలకు వెళ్లిపోయారు. దీంతో 22 ఏళ్లపాటు భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించిన అప్ఘానిస్థాన్ ఎంబసీ మూతపడింది. ఈ నేపథ్యంలో డిప్లొమాటిక్ మిషన్‌ను తాలిబన్ దౌత్యవేత్తలు భారత ప్రభుత్వానికి అప్పగించారు.


‘‘భారత ప్రభుత్వం నుంచి ఎదురవుతోన్న నిరంతర సవాళ్ల కారణంగా నవంబర్ 23 నుంచి ఎంబసీని శాశ్వతంగా మూసివేస్తున్నాం. సెప్టెంబర్ 30నే దౌత్యకార్యాలయం కార్యకలాపాలను నిలిపివేశాం. దీనివల్ల భారత ప్రభుత్వ వైఖరిలో మేం ఆశించిన మార్పు వస్తుందని భావించాం’’ అని అప్ఘాన్ ఎంబసీ పేర్కొంది. 8 వారాలపాటు వేచి చూసినప్పటికీ భారత ప్రభుత్వం తమ దౌత్యవేత్తలకు వీసాల గడువును పొడిగించలేదని అప్ఘాన్ ఎంబసీ ప్రకటించింది.


2021 ఆగస్టులో అప్ఘానిస్థాన్‌ పాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అప్ఘాన్ విద్యార్థులు, శరణార్థులు, వ్యాపారులు మన దేశాన్ని వదిలి వెళ్లారు. దీంతో భారత్‌లో అప్ఘాన్ పౌరుల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. చాలా పరిమితంగానే కొత్తగా వీసాలు మంజూరు చేస్తున్నారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్ఘాన్ దౌత్యవేత్తలకు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. అటు తాలిబన్లు, ఇటు భారత ప్రభుత్వం నుంచి నిరంతరం ఒత్తిడి పెరగడంతో.. ఎంబసీని మూసివేయడం మినహా తమకు మరో దారి లేకపోయిందని అప్ఘాన్ ఎంబసీ తెలిపింది. తమ దౌత్యవేత్తలందరూ ఇండియా వదిలివెళ్లారని... ఇక మిగిలింది తాలిబన్లతో సంబంధం ఉన్న అప్ఘా్న్ దౌత్యవేత్తలేనని ఎంబసీ వెల్లడించింది.


తాము ఎంబసీని భారత ప్రభుత్వానికి అప్పగించామన్న అప్ఘాన్ ఎంబసీ వర్గాలు.. దాన్ని మూసి ఉంచడమా..? లేదంటే తాలిబన్ దౌత్యవేత్తలకు అప్పగించడమా అనేది పూర్తిగా భారత ప్రభుత్వం చేతుల్లో ఉందని తెలిపాయి. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్ఘానిస్థాన్’ నియమించిన దౌత్యవేత్తల బాధ్యత అధికారికంగా ముగిసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 22 ఏళ్లపాటు తమకు సహకరించిన భారత ప్రజలకు అప్ఘాన్ ఎంబసీ ధన్యవాదాలు తెలిపింది.


రెండేళ్ల క్రితం అప్ఘానిస్థాన్ ప్రభుత్వాన్ని కూలదోసిన తాలిబన్లు పాలనను తమ చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్ఘాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. అయినా సరే తాలిబన్ ప్రభుత్వంతో అనధికారిక సంబంధాలు కొనసాగిస్తోంది. తాలిబన్ల ప్రభుత్వంలోని విదేశాంగ శాఖ.. ఢిల్లీలోని అప్ఘాన్ ఎంబసీలో ఈ ఏడాది ట్రేడ్ కౌన్సిలర్‌గా ఖాదిర్ షాను నియమించింది. ఎంబసీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారని తెలిపింది. 2020 నుంచి అప్ఘాన్ రాయబారిగా పని చేస్తోన్న ఫరీద్ మముంద్‌జాయ్‌ను వెనక్కి రావాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది. తనను ఆపద్ధర్మ రాయబారిగా అప్ఘాన్ ప్రభుత్వం నియమించిందని పేర్కొంటూ.. షా ఏప్రిల్ 28న భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఇవన్నీ అప్పటికే భారత్‌‌లోని అప్ఘాన్ ఎంబసీలో పనిచేస్తోన్న దౌత్యవేత్తలకు నచ్చలేదు. ఈ వ్యవహారంలో భారత్ తమకు అండగా ఉంటుందని వారు ఆశించారు. అయితే అప్ఘాన్ అంతర్గత వ్యవహారం కావడంతో.. భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. పాలకులతో సంబంధం లేకుండా అప్ఘాన్‌తో సంబంధాలను కొనసాగించాలనే వైఖరికే భారత్ కట్టుబడి ఉన్నట్టు దీని ద్వారా స్పష్టమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa