కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో అసమ్మతి వర్గం ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు షాకిచ్చింది. నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కీలక నేతలు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. వీరిలో ఇద్దరు ఎంపీపీలు, ఒక ఎంపీటీసీ, మరో సర్పంచ్ ఉన్నారు. ఏలేశ్వరం ఎంపీపీ, రీజనల్ కో ఆర్డినేటర్ గొల్లపల్లి బుజ్జి , రౌతులపూడి ఎంపీపీ రాజ్య లక్ష్మి , భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీ , తూర్పు లక్ష్మీపురం సర్పంచ్ డాక్టర్ వీరంరెడ్డి నాగ భార్గవి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
ఎన్నో ఆశలతో నియోజవర్గ ఎమ్మెల్యేగా పర్వతను గెలిపించుకున్నామని చెప్పారు. తాము ఎన్నికైన సుమారు మూడున్నరేళ్లలో ఎమ్మెల్యే పర్వత వల్ల ఎన్నో అవమానాలు, వేధింపులకు గురవుతున్నామన్నారు. అయినా ఓర్చుకొని ఈ విషయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ పీవీ మిథున్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబులకు తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ తీరు సరిగా లేదన్నారు. పార్టీ మీద గౌరవంతో ఇప్పటి వరుకు కొనసాగామని.. ఇటీవల జరిగిన సాధికారత బస్సు యాత్ర పార్టీ కూడా కనీస గౌరవం పాటించకపోవడంతోనే రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. పార్టీ పెద్దల దృష్టికి తమ సమస్యలను తీసుకుని వెళ్లినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నామని.. పదవులకు రాజీనామా చేసే విషయంలో తమ తమ అనుచరుల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం అంతా ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు నష్టం వాటిల్లుతోందని అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భద్రత కరువైందన్నారు. పార్టీ మార్పుపై తాము సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం ప్రకటిస్తామన్నారు. పోలీసుల ద్వారా ఎమ్మెల్యే పర్వత తమను బెదిరింపులతోనూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు వ్యతిరేకంగా ఎంపీపీలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జన్మదినం సందర్భంగా అన్నవరం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు ‘జగన్ ముద్దు.. ప్రసాద్ వద్దు’.. అంటూ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీగా వెళ్లారు. ఇలా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అసమ్మతి గళం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈసారి తనకు కచ్చితంగా అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు.