విశాఖ ఏవోబిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏవోబీ పరిధిలోని హంతల్‌గుడా ఘాట్ రోడ్డు వద్ద సిమెంట్ లారీ బోల్తా పడగా.. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలు వదిలారు. మరో 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చిత్రకొండ నుంచి సిమెంట్ బస్తాలు, ఇనుప రాడ్లతో ఉన్న ఓ టిప్పర్ హంతల్‌గుడా వైపు వెళ్తోంది. లోడ్‌తో పాటు లారీలో 16 మంది కూలీలు కూడా ఉన్నారు. జోడాంబో ఠాణా హంతాల్‌గుడా ఘాట్ రోడ్డు వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో.. కూలీలు కిందపడగా.. వారి మీద సిమెంట్ బస్తాలు, ఇనుప రాడ్లు పడటంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన వాహనదారులు సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడిన కూలీలను జోడాంబో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితులను నవరంగపూర్ జిల్లాకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మల్కాన్‌గిరి జిల్లా ఎమ్.వి. 79 గ్రామానికి చెందిన పీకే స్వాయీ అనే కాంట్రాక్టర్ స్వాభిమాన్ ప్రదేశంలో బ్రిడ్జ్‌తో పాటు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టగా.. వాటి కోసం సిమెంట్ బస్తాలు, ఇనుపరాడ్లు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారి కుటుంబ వివరాలు తీసుకున్న పోలీసులు.. సమాచారం అందించారు. అయితే.. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.