విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగి అగ్నిప్రమాదం ఘటన మరో మలుపు తిరిగింది. తాజాగా ఈ ఘటనకు చిన్నా సిగరెట్ ముక్క కారణమని తేలింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ఈ నెల 19న రాత్రి కొందరు వ్యక్తులు హార్బర్‌లో పార్టీ చేసుకున్నారు. మందులోకి మంచింగ్ కోసం వారు ఉప్పు చేపను ఫ్రై చేశారు. ఆ చేపను తిన్న తర్వాత వారిలో ఒకరు సిగరెట్ వెలిగించారు.. అయితే చివర్లో చిన్న ముక్కను బోటు సమీపంలో పడేసి వెళ్లిపోయారు. అలా ఆ సిగరెట్ నుంచి మొదలైన చిన్న నిప్పు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. మరో వాదన కూడా వినిపిస్తోంది.. ఉప్పు చేపను ఫ్రై చేసే క్రమంలో మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.
ఆ ఉప్ప చేప ఫ్రై చేయడం, ఆ సిగరెట్ ముక్క మత్స్యకారుల కొంప ముంచింది. ఈ ఘటనలో ఉప్పు చేపను ఫ్రై చేసింది స్థానిక మత్స్యకారుడు నాని (యూట్యూబర్ కాదు) అని చెబుతున్నారు.. నానికి వరుసకి మామ అయ్యే సత్యం కోసం చేపను ఫ్రై చేసినట్లు తెలుస్తోంది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నాని బోటులో.. ఆయన మామ సత్యం పని చేశారట. పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజ్‌లో కూడా సత్యం బయటకు వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.. అధికారికంగా పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది.