సంగం డెయిరీ డైరెక్టర్లు, ఉద్యోగులపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ముగ్గురు డైరెక్టర్లు, 14 మంది ఉద్యోగులపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సంగం డెయిరీ లోపలకు వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారిని ఉద్యోగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో డెయిరీ ఉద్యోగులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈనెల 15న డెయిరీ బయట రైతులు, కొందరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనలో 15 మందిపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. సంఘటన జరిగినప్పుడు ధూళిపాళ్ల.. పొన్నూరు టీడీపీ ఆఫీస్‌లో ఉన్నారు. ఆ సమయంలో కేసు నమోదు చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం పొన్నూరు రూరల్ సీఐ , చేబ్రోలు ఎస్సై తమ సిబ్బందితో కలిసి డెయిరీ ప్రధాన ద్వారం వద్దకు వచ్చారు. 15న జరిగిన సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజి పరిశీలించేందుకు పోలీసులు వచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగులతో వాగ్వాదం జరిగింది.
ప్రభుత్వం కక్ష కట్టి తమపై అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తోందని సంగం డైరెక్టర్లు, ఉద్యోగులు ఆరోపిస్తున్నార. డెయిరీ బయట జరిగిన ఘర్షణకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌తోపాటు కొందరు ఉద్యోగులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం ఏమిటిని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం పోలీసులు అత్యుత్సాహంతో డెయిరీ లోపలకు వచ్చేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంగం డెయిరీని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారన్నారు.
గతంలో కూడా డెయిరీపై కేసు నమోదు చేసి, ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అరెస్టు చేయడాన్ని చూశామన్నారు. న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. ఇప్పుడు డెయిరీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు చేత గొడవ చేయించారు. ఆ ఘర్షణల్లో ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేరు చేర్చి అక్రమ కేసు నమోదు చేశారన్నారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థలోని డెయిరీలను ప్రభుత్వం నాశనం చేస్తోందని.. అమూల్‌కు ప్రభుత్వ డెయిరీ ఆస్తులను కట్టబెడుతున్నారన్నారు. సంగంను డెయిరీని మూసివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.