తన భార్య, రెండేళ్ల కుమార్తెను ఓ వ్యక్తి పాముతో కాటు వేయించి చంపేశాడు. భార్యాభర్తల మధ్య గొడవ, పాముకాటుతో చనిపోయిన బాధితుల కుటుంబానికి ప్రభుత్వం అందజేసే రూ.4 లక్షల చొప్పున పరిహారం కోసం ఆశపడి పాపానికి ఒడిగట్టాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఒడిశాలోని బరంపురం సమీపంలో అక్టోబరు 7న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బరంపురం జిల్లా కబిసూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధేగాన్ గ్రామానికి చెందిన గణేశ్ పాత్ర (25)కు 2020లో బసంతి పాత్రతో వివాహమైంది. ఈ దంపతులకు రెండేళ్ల పాప దబస్మిత ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
భార్యపై కోపాన్ని పెంచుకున్న గణేశ్ పాత్ర.. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో పాము కాటుతో చనిపోయినవారికి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని కూడా పొందాలని భావించాడు. దీంతో పాముల పట్టే వ్యక్తిని సంప్రదించి.. మతపరమైన పూజల కోసమని అబద్దం చెప్పి అతడి వద్ద విష సర్పాన్ని తీసుకున్నాడు. ప్లాస్టిక్ బాటిల్‌లో పామును తీసుకొచ్చి అక్టోబరు 6 రాత్రి భార్య, తన కుమార్తె నిద్రపోతున్న గదిలోకి వదిలాడు. నిందితుడు మరో గదిలో నిద్రపోయాడు. ఆ సర్పం ఇద్దర్నీ కాటువేయడంతో తెల్లవారేసరికి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
తొలుత దీనిని సహజ మరణంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడి మామ అనుమానం వ్యక్తం చేయడంతో నిందితుడిపై ఎఫ్ఆర్ఐ నమోదుచేశారు. పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా పథకం ప్రకారమే పాముతో కాటు వేయించి చంపేసినట్టు వెల్లడయ్యింది. దీనిపై గంజాం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ‘నిందితుడికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడంలో జాప్యం వల్ల ఘటన జరిగిన నెల రోజుల తర్వాత అరెస్ట్ చేశాం.. విచారణలో తొలుత తనపై ఆరోపణలు చేస్తున్నారని, పాము గదిలోకి దూరిందని బుకాయించాడు.. చివరకు తానే నేరానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు’ అని చెప్పారు.