జాతీయ ఆరోగ్య సర్వే-5 (2019-21) ప్రకారం దేశంలో పిల్లలు ఉండాల్సినంత బరువు లేరు. ఆరోగ్యపరంగా వారి కుంగిపోతున్నారు. 32% మంది పిల్లలు తక్కువ బరువుతో బలహీనంగా కన్పిస్తున్నారు. 35% మంది కుంగుబాటుకు గురవుతున్నారు. ఈ అంశాల్లో నేపాల్ 24%, 31.5%తో మన కంటే మెరుగ్గా ఉంది. బంగ్లాదేశ్ అయితే 23%, 28%తో మరింత మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. నేపాల్ పొరుగునే ఉన్న బీహార్‌లో మాత్రం ఇవి 41%, 43%గా ఉన్నాయి.
అనేక ఇతర ఆరోగ్య, విద్య సూచికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అసమానతల వ్యత్యాసాన్ని కుల రక్కసి మరింత పెంచుతోంది. కుల వ్యవస్థే మన దేశాన్ని సమస్యల వలయంలోకి నెడుతోంది. ఆదాయం, లింగం, ప్రాంతం, భాష, చారిత్రక ప్రయోజనం వంటి అంశాల్లో అసమానతలకు కులమే ప్రధాన కారణం అవుతోంది. సంపన్న కులాల వారు మరింత అభివృద్ధి సాధిస్తుంటే దిగువ కులాలు విద్య, ఆరోగ్యం వంటి కనీస సౌకర్యాలకు సైతం నోచుకోలేకపోతున్నారు. భారత్‌లోని సంపన్న వర్గం వారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ శక్తిగా ఆవతరిస్తే దిగువ కులాల వారు బాగా వెనుకబడి పోయారు.