ఆరోగ్యం, విద్య వంటి కీలకమైన, ముఖ్యమైన రంగాలకు సంబంధించి పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ బాగా వెనుకబడి ఉంది. దీనికి కుల అసమానతలే ప్రధాన కారణమని సీనియర్ విశ్లేషకుడు స్వామినాధన్ ఎస్. అంక్లేసారియా అయ్యర్ తన రాబోయే పుస్తకం ‘అసమానత : పొరుగు దేశాల కంటే భారత్ ఎందుకు వెనుకబడింది?’లో అభిప్రాయపడ్డారు. సామాజిక సూచికలైన జీవితకాలం, సంతానోత్పత్తి, శిశుమరణాలు, లింగ సమానత్వం వంటి అంశాల్లో నేపాల్, బంగ్లాదేశ్ కంటే మనం వెనుకబడి ఉన్నామని ఆయన తెలిపారు. స్వామినాథన్ పుస్తకానికి ప్రముఖ ఆర్థికవేత్త డీన్ డ్రెడ్జ్ ముందుమాట రాశారు.
జీవితకాలం, శిశుమరణాలు, పారిశుధ్యం, పాఠశాల విద్య, లింగ సమానత్వం వంటి అంశాల్లో బంగ్లాదేశ్ మన దేశం కంటే ఎంతో ముందుంది. ఆయా విషయాల్లో రెండు దేశాల మధ్య వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. ఇది భారత్‌కు చాలా అవమానకరం. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వేతర సంస్థలు అద్భుతమైన, బలమైన పనితీరు కనబరుస్తున్నాయి. ముఖ్యంగా ప్రజారోగ్యం విషయంలో వాటి పాత్ర ప్రశంసనీయం. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కూడా మన దేశంతో సమానంగా ఉంది. నేపాల్‌లో మాత్రం తలసరి ఆదాయం భారత్‌తో పోలిస్తే సగం మాత్రమే ఉంది. అయినప్పటికీ ఆ దేశం ముందడుగు వేస్తోంది.