రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది.