రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో ఉదయం 10.19 గంటలకు పాదయాత్రలో మళ్లీ తొలి అడుగుపడింది. రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభమైన యాత్రకు జనం పోటెత్తారు. తాటిపాక సెంటర్‌లో జరిగిన బహిరంగ సభకు జనం సునామీలా వచ్చారు. కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంఘీభావంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. తనపై ఆరు కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్రను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చంద్రబాబును జైలుకు పంపితే తన పాదయాత్ర ఆగుతుందని భ్రమపడ్డారని ఎద్దేవా చేశారు. చివరికి అన్న క్యాంటీన్‌నూ వదలేదని విమర్శించారు. స్కిల్ ఖాతాలో ఒక్క ఆధారమైనా చూపించలేకపోయారని ధ్వజమెత్తారు.
వ్యవస్థలను మ్యానేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ఇక్కడ నిల్చున్నానని తెలిపారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటానని హెచ్చరించారు.