హమాస్ తో కాల్పుల విరమణ ఆలోచననే కొట్టిపారేసిన ఇజ్రాయిల్ గాజాలో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణను, బంధీల పరస్పర మార్పిడిని ప్రకటించింది. ఆరు వారాలపాటు అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ కొనసాగించిన మారణహౌమం తరువాత పశ్చిమ దేశాల నాయకులు భావించినట్టుగా హమాస్ అంతం అయివుండాలి. అయితే అలా జరగలేదు. హమాస్ ప్రతిఘటన అరబ్ దేశాలలోను, ఆవలా పాలస్తీనా ఉద్యమ ప్రతిష్టను పెంచింది. శుక్రవారం నాలుగురోజుల కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. దీనితో గాజాలో జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన వారికి ఉపశమనం కలుగుతుంది. కానీ ఇది ఇజ్రాయిలీ ప్రభుత్వ బలహీనతలను బయటపెడుతుంది. ఈ కాల్పల విరమణతో ఇజ్రాయిల్, హమాస్ ల చెరలో బంధీలుగావున్న మహిళలు, పిల్లలు తమతమ కుటుంబాలతో ఏకమవటానికి మార్గం సుగమం అవుతుంది.
కాల్పుల విరమణ తరువాత 46రోజులుగా కొనసాగుతున్న యుద్ధాన్ని కొనసాగించటం హమాస్ కు కష్టమౌతుంది. అక్టోబర్ 27వ తేదీ గాజాలో కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ పెద్ద మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం అమలు తప్పనిసరి కానప్పటికీ 120 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మానాన్ని ఇజ్రాయిల్, అమెరికా పూర్తిగా తిరస్కరించాయి. అరబ్ దేశాలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ”నాజీ టెర్రరిస్టులను పరిరక్షించేది” అని ఐక్యరాజ్య సమితిలోని ఇజ్రాయిల్ రాయబారి గిలద్ ఎర్డన్ అన్నారు. ఇది హమాస్ నలుగురు ఇజ్రాయిలీ పౌరులను మానవతా కారణాలతో విడుదల చేసిన తరువాత జరిగింది. హమాస్ ను నాశనం చేయటమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ప్రకటించారు. ఆరు వారాలపాటు అత్యంత జనసాంద్రతగల గాజాపైన బాంబుల వర్షం కురిపించి దాదాపు 20000మంది ప్రాణాలను తీసినా ఇజ్రాయిల్ హమాస్ ను నాశనం చేయలేకపోయింది. నిజానికి ఇజ్రాయిలీ సైన్యం పాలస్తీనా సాయుధ గ్రూపులపైన చెప్పుకోదగినంత పైచేయిని సాధించలేకపోయింది. గత రెండు వారాల యుద్ధంలో హమాస్ 355 ఇజ్రాయిలీ సాయుధ శకటాలను ధ్వంసం చేసింది. బంధీలను బలవంతంగా విడుదల చేయటం, సొరంగ మార్గాలను బయటపెట్టటం, ఇజ్రాయిల్ సీనియర్ హమాస్ నాయకులను, పెద్ద సంఖ్యలో హమాస్ యోధులను హతమార్చటంవంటి విషయాలలో ఇజ్రాయిల్ ఘోరంగా విఫలం అయింది. ఇక ఆర్థిక విషయాలను తీసుకుంటే ఇజ్రాయిల్ హమాస్ పైన చేస్తున్న యుద్ధంలో ఇప్పటివరకు 50బిలియన్ డాలర్లను వ్యయం చేసింది. ఇది ఇజ్రాయిల్ స్థూల జాతీయోత్పత్తిలో 10శాతానికి సమానం. ఇదే కాకుండా ఇజ్రాయిల్ తన ఉత్తర సరిహద్దులో హమాస్ మిత్ర సాయుధ మిలీషియా గ్రూపు హెజ్బొల్లా దాడులలో గూఢచర్య, ఇతర పర్యవేక్షక యంత్రాంగాన్ని చాలా నష్టపోయింది. యెమెన్ లోని అన్సరల్లా గ్రూపు ఒక ఇజ్రాయిలీ వ్యాపారవేత్తకు చెందిన నౌకను ఎర్ర సముద్రంలో స్వాధీనం చేసుకుంది. దీని ప్రభావం దక్షిణ నౌకాశ్రయ నగరం ఎయిలాత్ నుంచి జరుగుతున్న వాణిజ్యంపైన పడింది. ఇవన్నీకాకుండా సిరియా, ఇరాక్ దేశాలలో తిష్టవేసిన అమెరికా సైన్యంపైన, సైనిక స్థావరాలపైన నిరంతరం కొనసాగుతున్న దాడులతో అమెరికా వత్తిడికి గురౌతోంది. ఈ దాడులు గాజాపైన ఇజ్రాయిలీ దాడులను ముగించేలా అమెరికా చేయాలనే లక్ష్యంతో కొనసాగుతున్నాయి. యావత్ అరబ్ ప్రపంచంలో పశ్చిమ దేశాలకు చెందిన కంపెనీలు సరఫరా చేసిన వస్తువులను ఎన్నడూలేని స్థాయిలో సాధారణ ప్రజలు బహిష్కరిస్తున్నారు. పశ్చిమ దేశాల పాలక వర్గాల, ఆయా దేశాల మీడియా పాటిస్తున్న ద్వంద ప్రమాణాలు తీవ్ర విమర్శలకు గురౌతున్నాయి.
యావత్ ప్రపంచ తీవ్ర విమర్శలకు, అణచివేతకు గురవటానికి బదులుగా హమాస్ బ్రతికి బయటపడటమే కాకుండా ప్రజల్లో మరింతగా తన ప్రతిష్టను పెంచుకుంది. హమాస్ కు స్థావరాలుగావున్నాయన్న నెపంతో గాజాలోని ఆస్పత్రులపైన ఇజ్రాయిల్ చేసిన దాడులను అమెరికా ఎంతగా సమర్థించినప్పటికీ ఆ దాడులు పాలస్తీనా భూభాగంపైన జరగటాన్ని యావత్ ప్రపంచం నిరసించింది. గాజాలో అమెరికా ఇజ్రాయిల్ కు పరిమితులను విధించకపోవటంవల్లనే కనీవినీ ఎరుగని మానవతా సంక్షోభం ఏర్పడిందని ఐక్యరాజ్య సమితికి చెందిన రిలీఫ్ అధినేత మార్టిన్ గ్రిఫ్పిత్స్ అన్నాడు.
ఇదిలావుండగా హమాస్ తన గెరిల్లా యుద్ధ తంత్రాన్ని విజయవంతంగా అములు చేస్తూ తన సైనిక సామర్థ్యాన్ని తగ్గకుండా చూసుకుంటోంది. అక్టోబర్ 7వ తేదీనాడు ఇజ్రాయిల్ పైన హమాస్ చేసిన మెరుపు దాడి, దాని తక్షణ పర్యవసానాలవల్ల హమస్ పాలస్తీనా సమస్యవైపు ప్రపంచం ద్రుష్టిని ఆకర్షించేలా చేయగలిగింది. బారక్ ఒబామా పాలనలో ప్రతిపాదించిన ”కెర్రి పీస్ ప్లాన్” తరువాత పాలస్తీనా రాజ్య స్థాపనకు అమెరికా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. నిజానికి అక్టోబర్ 7వ తేదీదాకా పాలస్తానా రాజ్యం ఏర్పాటు గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నేడు యావత్ ప్రపంచం పాలస్తీనా రాజ్యం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను గురించి మాట్లాడుతోంది. గాజాపైన 17ఏండ్లపాటు సాగుతున్న ఆర్థిక దిగ్బంధాన్ని ముగించి పాలస్తీనా అధికారాన్ని స్థాపించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అలాగే జెరుసలెంలోని అల్ అక్సా మసీదును రక్షించవలసిన అవసరం ప్రాంతీయ ఏజెండాగా మారింది.
ఒకవేళ ఇజ్రాయిల్, దాని సమర్థకులైన అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించటానికి బదులుగా యుద్ధాన్ని తీవ్రతరం చేయదలిస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుంది. అటువంటి పరిస్థితి ఆ ఘర్షణలో పాల్గొంటున్న దేశాలన్నింటి స్థిరత్వానికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగితే అది ఈ యుద్ధంలో కొత్త అధ్యాయం అవుతుంది. దానిలో హమాస్ మిగిలే ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనాలకు శాంతి ఆవశ్యకత ఉంటుంది. ఇజ్రాయిలీ సైన్యం సామాన్య ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిందితప్ప పాలస్తీనా సాయుధ గ్రూపులను ఓడించలేకపోయింది. ఈ వాస్తవాన్ని పశ్చిమ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పాలస్తీనా సమస్యని శాంతియుతంగాతప్ప హింసాత్మకంగా పరిష్కరించటం సాధ్యంకాదనే విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే ఇజ్రాయిల్, దాని మద్దతుదారైన అమెరికాకు అంత మంచిది.