ఐరోపాలో అత్యధిక క్రియాశీలక అగ్నిపర్వత వ్యవస్థలకు నిలయమైన ఐస్‌లాండ్‌లో ఆదివారం 700 భూకంపాలు సంభవించాయి. సోమవారం ఉదయం గ్రిందావిక్ పట్టణానికి సమీపంలో 48 గంటల్లో బలమైన భూకంపం సంభవించినట్లు ఇండిపెండెంట్ ఒక నివేదికలో పేర్కొంది. ‘అగ్నిపర్వత విస్ఫోటనం సంభావ్యత’ ఉందని ఐస్లాండ్ మెటీరియాలజికల్ ఆఫీసు హెచ్చరికలు చేసింది. అక్టోబర్ చివరలో రాజధాని రేక్‌జావిక్‌కు సమీపంలో ఉన్న ప్రాంతంలో భూకంప కార్యకలాపాలు, భూగర్భ లావా ప్రవాహాలు పెరిగినప్పటి నుంచి ఐస్‌లాండ్ అధిక ప్రమాద ముప్పును ఎదుర్కొంటోంది.
‘ఆదివారం దాదాపు 300 భూకంపాలు సంభవించాయి.. పట్టణానికి సమీపంలో అర్ధరాత్రి ఒక గంటకు పైగా ఇవి కొనసాగాయి. ఈ నెల 26 న గ్రిందావిక్‌కు ఉత్తరాన ఉన్న డైక్ సమీపంలో దాదాపు 700 భూకంపాలు గుర్తించాం’ అని పేర్కొంది. గత 48 గంటల్లో 2.7 తీవ్రతతో బలమైన భూకంపం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. నగరం అంతటా పెద్ద అగాధాలు కనిపించడంతో భూకంప కార్యకలాపాలు అగ్నిపర్వత విస్ఫోటనం పొంచి ఉన్నందున పౌరులు గ్రిందావిక్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించారు. ‘ఇది ఇప్పటికీ ఇక్కడ ప్రమాదకరం... నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. సాధారణంగా బయటికి వెళ్లడానికి కొన్ని నిమిషాల హెచ్చరిక ఉంటుంది.. కానీ ఈ రోజు ఉన్న వాతావరణం మాకు ఇంకా తక్కువ ఉంది’ అని పౌర రక్షణ అధికారి ఒకరు చెప్పారు.
‘ప్రతిదీ నమ్మశక్యంగా లేదు... నేను డిస్టోపియన్ సినిమాలో ఉన్నట్లు భావిస్తున్నాను. నేను ఈ పీడకల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని గ్రిందావిక్ పట్టణానికి చెందిన ఆండ్రియా అనే ఓ వ్యక్తి అన్నారు. ఐదుగురు ఐస్‌లాండ్ మంత్రులు శుక్రవారం గ్రిందావిక్‌ను సందర్శించారు. అక్కడ నుంచి ఖాళీచేసిన నివాసితులకు తమ వ్యక్తిగత వస్తువులను తీసుకోవడానికి అనుమతించారు. అయితే, మౌలికసౌకర్యాలు దెబ్బతినడంతో అక్కడి ప్రజలు తిరిగి గ్రిందావిక్‌కి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ విదిర్ రేనిసన్ చెప్పినట్టు ఐస్‌లాండ్ మీడియా పేర్కొంది.