ఆదివారం నాడు మన్ కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. విదేశీ వేదికలకు బదులుగా దేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్‌లను చేసుకోవాలని సూచించారు. దీని వల్ల దేశంలో అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని అన్నారు. ‘పెళ్లి అనే అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఒక విషయం నన్ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది… నేను నా హృదయంలో బాధను కుటుంబసభ్యులకు (దేశ పౌరులు) తప్ప ఎవరితో చెప్పగలను.. ఒక్కసారి ఆలోచించండి.. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.. ఇది అస్సలు అవసరమా? భారత గడ్డపై భారతీయుల మధ్య వివాహాల వేడుకలు జరుపుకుంటే దేశ సంపద దేశంలోనే ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.
ధనిక కుటుంబాలు అలా చేయడం వల్ల ఇక్కడి ప్రజలు అలాంటి వివాహాల్లో ఏదో ఒక సేవ లేదా మరొకటి అందించే అవకాశం లభిస్తుంది.. పేదలు కూడా తమ పిల్లలకు వీటి గురించి గొప్పగా చెబుతారని ఆయన అన్నారు. ‘‘వోకల్ ఫర్ లోకల్’ మిషన్‌ను ప్రచారం చేయలేరా? మన దేశంలో ఇలాంటి వివాహ వేడుకలు ఎందుకు నిర్వహించకూడదు? మీరు కోరుకునే వ్యవస్థ ఈ రోజు ఉండకపోవచ్చు, కానీ మనం అలాంటి ఈవెంట్‌లను నిర్వహిస్తే వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇది ధనిక కుటుంబాలకు సంబంధించిన అంశం. నా ఈ బాధ ఖచ్చితంగా ఆ కుటుంబాలకు చేరుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
‘స్వచ్ఛ్ భారత్ మిషన్ విజయం ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారానికి స్ఫూర్తినిచ్చింది.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధికి హామీ ఇస్తూ అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన భారతదేశానికి ఇది ద్వారాలు తెరుస్తోంది.. ఇది పట్టణ, గ్రామీణ ప్రజలకు సమాన అవకాశాలను అందిస్తుంది. స్థానిక ఉత్పత్తుల విలువ జోడింపునకు కూడా మార్గం సుగమం చేస్తుంది.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు ఉంటే, లోకల్ కోసం వోకల్ అనే మంత్రం మన ఆర్థిక వ్యవస్థను కూడా రక్షిస్తుంది’ అని మోదీ అన్నారు.
కేవలం పండుగలకే పరిమితం కాకూడదని, పెళ్లిళ్లకు కూడా భారతీయ ఉత్పత్తుల వాడాలనే సెంటిమెంట్‌ని రగిలించాలని ఆయన సూచించారు. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేసినట్లు మోదీ తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నందున దీపావళి సందర్భంగా నగదు చెల్లింపులు తగ్గాయని ప్రధాని హైలైట్ చేశారు. ఒక నెల పాటు నగదును అస్సలు ఉపయోగించకుండా ప్రయత్నించాలని, యూపీఐ లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలని ఆయన ప్రజలను కోరారు. అలాంటి వినియోగదారులు తమ అనుభవాలను, ఫోటోలను పంచుకోవాలని కూడా తెలిపారు.