సార్వత్రిక ఎన్నికల్లో మతరాజకీయాలు చేయటానికి మళ్లీ తెరపైకి సీఏఏ అంశాన్ని తెరపైకి తేనున్నది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తుది ముసాయిదా వచ్చే ఏడాది మార్చి 30 నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నట్టు కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వారి నుంచి పౌరసత్వ హక్కులను ఎవరూ లాక్కోలేరని నొక్కి చెప్పారు.”సీఏఏను అమలు చేసే ప్రక్రియ గత రెండేండ్లలో ఊపందుకున్నది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయి. మతువాల నుంచి పౌరసత్వ హక్కులను ఎవరూ లాక్కోలేరు. వచ్చే ఏడాది మార్చి నాటికి సీఏఏ తుది ముసాయిదా అమల్లోకి రావడానికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నాం” అని తెలిపారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్‌లోని అధికార టీఎంసీ స్పందించింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ మాట్లాడుతూ.. ”బీజేపీకి ఎన్నికల సమయంలో మాత్రమే మతువాలు, సీఏఏ గుర్తుకు వస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో కాషాయ పార్టీ ఎప్పటికీ సీఏఏను అమలు చేయలేదు. 2024 ఎన్నికలలో కాషాయపార్టీని అందరూ తిరస్కరిస్తారు” అని ఆయన అన్నారు.