ప్రజాస్వామ్యంలో ఒకచోటనే ఓటు ఉండాలని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఒకరి ఓటు రెండు, మూడు చోట్ల ఉన్నట్లు మేం గుర్తించామని తెలిపారు. బుధవారం వైయస్‌ఆర్‌సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, టీడీపీ నేతల అక్రమాలపై ఎన్నికల అధికారికి వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఒకచోటనే ఓటు ఉండాలని అన్నారు. ఒకరి ఓటు రెండు, మూడు చోట్ల ఉన్నట్లు మేం గుర్తించామని తెలిపారు. తెలంగాణలో ఉన్న వారి ఓట్లు, ఇతర దేశాల్లో వారి ఓట్లు కూడా ఏపీలో ఉన్నాయని చెప్పారు. ఇలాంటివి కొన్ని మేము గుర్తించామని పేర్కొన్నారు. వీటిపై మేం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించినట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ వాళ్లు మాపై రోజూ ఎల్లోమీడియాలో వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు, లక్షల ఓట్లు చేర్పించారని ఇంకోరోజు రాస్తున్నారని తప్పుపట్టారు. ఎలాగో ఓడిపోతామని తెలిసే అలాంటి రాతలు రాస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని మేం మొదటి నుంచి చెబుతున్నామని, ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి జోగి రమేష్ చెప్పారు. 70 రోజులు పారిపోయిన లోకేష్..మంత్రులకు భయం చూపుతాడంట అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో మేము ఉరికెత్తించి ఓడిస్తామని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.