ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతమని, లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇలాంటి వాటిని సరిచేయాలని ఎన్నికల కమిషన్‌ను కలిసామని మంత్రి జోగి రమేష్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాను వైసీపీ నేతలు కలిసారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలోనూ ఓటు వేసే అవకాశం ఉందని, అక్కడ ఓటు వేసిన తర్వాత రద్దు చేసుకుని ఏపీలో ఓటు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎలాగూ ఓడిపోతారనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందే టీడీపీ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీ చేవలేని పార్టీలా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్‌ను ఉరికిస్తామని, 50 రోజులు ఢిల్లీ పారిపోయిన ఆయన సీఎంను భయపెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవారు 16 లక్షల వరకు ఉన్నారని.. అలాంటి వారిని ఒకే చోటకు పరిమితం చేయాలన్నారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో వేయకుండా చూడాలని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి ఫిర్యాదు చేసామని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఈసీని కలిసినవారిలో మంత్రులు జోగి రమేష్, మేరుగా నాగార్జున, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల అంశం, రెండు రాష్ట్రాల్లో ఓటు ఉండటంపై ఫిర్యాదు చేశారు.