విశాఖలో రెస్టారెంట్ల నిర్వాకం బయటపడింది. ముందు రోజు మిగిలిపోయిన బిర్యానీ.. రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్.. కిచెన్ దుర్వాసన వెదజల్లుతోంది. నగరంలోని జగదాంబ జంక్షన్, మధురవాడలో ఉన్న రెస్టారెంట్, హోటల్‌లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీల్లో ఇదంతా బయటపడింది. హోటళ్లలో నాణ్యత లేని, నిల్వ ఉంచిన ఆహారం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండు హోటళ్లలో సోదాలు నిర్వహించారు. జగదాంబ జంక్షన్‌లోని రెస్టారెంట్‌లో తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లతో నిల్వ ఉంచిన చికెన్ లాలీపాప్, చికెన్ ఫ్రై కర్రీ, లివర్‌లను అధికారులు గుర్తించారు. చికెన్ లాలీపాప్‌లు రోజుల తరబడి నిల్వ ఉన్నాయని తేల్చారు.. బిర్యానీ ముందురోజు మిగిలిపోయినదిగా గుర్తించారు. అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడే వంటగదిలో బిర్యానీ, చికెన్ లాలీపాప్‌లను వేడి చేస్తున్నారు. వంట గదిని పరిశీలించేందుకు వెళ్లిన అధికారులు అక్కడి వాసన దెబ్బకు ముక్కులు మూసుకోవాల్సి వచ్చింది.
హోటల్‌కు వచ్చిన కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేయగానే ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసిన పదార్థాలను తీసి.. అప్పటికప్పుడు వేడి చేసి సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు. హోటల్‌పై కేసు నమోదుచేసి శాంపిళ్లను సేకరించి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు పంపిస్తున్నామన్నారు. కిచెన్‌లో పరిశుభ్రత పాటించకపోవడంపై ఆ రెస్టారెంట్‌కు రూ.10 వేలు జరిమానా విధించారు. అలాగే మధురవాడలోని మరో హోటల్‌లో మిగిలిపోయిన బిర్యానీ అమ్ముతున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం ఆ హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించింది. కల్మీకబాబ్, బిర్యానీ నిల్వ ఉన్నట్టు గుర్తించి వాటి శాంపిళ్లను సేకరించడంతోపాటు వంట గదిలో పరిశుభ్రత లేకపోవడంపై రూ.15 వేలు జరిమానా విధించారు. రెస్టారెంట్, హోటల్‌పైనా కేసు నమోదు చేశారు. శాంపిళ్లను ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని విక్రయిస్తున్నట్టు నిర్ధారణ అయితే ఆయా హోటళ్లపై తదుపరి చర్యలు ఉంటాయన్నారు అధికారులు.