తిరుమల శ్రీవారి సుప్రభాత సేవకు సంబంధించి మరో మోసం బయటపడింది. నకిలీ ఐడీ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో శ్రీవారి సుప్రభాత సేవను పొందిన వ్యక్తిపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. విజయవాడకు చెందిన రసూల్ కొంతకాలంగా నకిలీ ఐడీ ఆధార్ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో పాల్గొనేవాడు. అలాగే సుప్రభాతసేవ టికెట్‌తో దర్శనానికి వచ్చిన అతడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అతడి నుంచి నకిలీ ఐడీలను స్వాధీనం చేసుకుని తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సదరు టికెట్లను ఎవరికీ విక్రయించలేదని.. సొంతానికి వాడుకుంటునాని చెప్పినట్లు తెలుస్తోంది. రసూల్ ఆన్‌లైన్ లక్కీడిప్‌లో ఎలాగైనా ఆర్జితసేవా టికెట్ పొందాలని తన పాస్‌పోర్టు చివరి నంబర్లు మారుస్తూ దాదాపు 70 సార్లు లక్కీడిప్ వేశాడు. ఈ క్రమంలో సోమవారానికి సుప్రభాతసేవ టికెట్ లభించింది. టికెట్‌తో దర్శనానికి వచ్చిన రసూల్ పాస్‌పోర్టు, ఇతర గుర్తింపుకార్డులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. పాస్‌పోర్టులోని నంబర్లను మార్చినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతి తెలివితో పాస్‌పోర్టు చివరి నంబర్లు మార్చి సుప్రభాత సేవల టికెట్లను బుక్ చేశాడు.. కానీ టీటీడీకి అడ్డంగా దొరికిపోయాడు.