మరో రోజుల్లో జగన్ కోరుకునే యుద్ధం ఇస్తామని, అది ఆయన ఓడిపోయే యుద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ చెప్పినట్లు అది కురుక్షేత్ర యుద్ధం కాకపోవచ్చని, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే యుద్ధం అవుతుందన్నారు. ప్రజాకంటకుడు జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొడదామని పిలుపునిచ్చారు. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ఏపీలో శాంతి, సుస్థిరత నెలకొల్పి అభివృద్ధి సాధించడమేనని పేర్కొన్నారు. దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే యుద్ధంలో అసలు విజయమని అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘భవిష్యత్తులో రాష్ట్రం విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదనేది జనసేన అంతిమ లక్ష్యం. 2024 తర్వాత దశాబ్ద కాలం పాటు జగన్ రాజకీయాల వైపు చూడకూడదు. మళ్లీ మంచి మనిషిగా మారి, ప్రజలకు చేసిన ద్రోహంపై పశ్చాత్తాపడిన రోజు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేలా చూద్దాం. నేను ఏ రాజకీయ వ్యూహం వేసినా, నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లినా అది పూర్తిస్థాయిలో ప్రజలకు మేలు చేసేదిగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రత్యర్థి బతకాలి. అంతేగానీ సంపూర్ణంగా ప్రత్యర్థులను చంపేసి మొత్తం నేనే పెత్తనం చేయాలనుకోవడం తప్పు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెడితే తప్పు. వారికి నచ్చకపోతే మెగాస్టార్‌ను బెదిరించగలరు. తమిళ సూపర్ స్టార్‌ను భయపెట్టగలరు. వైసీపీ నాయకుల్ని పొగడకపోయినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఎంతటి వారికైనా బూతులు, బెదిరింపులు తప్పవు. వైసీపీ దాష్టీకాలకు చెక్ పెట్టాలనే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందు వెళ్లాలని నిర్ణయించాం. జగన్ అనే వ్యక్తి ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేసి, రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తూ.. మహా నాయకుడిగా పరిపాలన చేస్తే కచ్చితంగా స్వతంత్రంగానే పోటీ చేసే వాళ్లం. కానీ రాష్ట్రంలో ప్రజల వేదనను పరిశీలిస్తే ఈ ప్రభుత్వం మళ్లీ రాకూడదనేలా పరిస్థితులున్నాయి. దాని కోసమే ప్రజల అభీష్టం మేరకు కలిసే పోటీ చేస్తున్నాం. మరోసారి వైసీపీ అధికారంలోకి రాకూడదనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఒక్కోసారి ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంటానని వైసీపీ వాళ్లు విమర్శిస్తారు. అసలు వైసీపీకే స్పష్టమైన విధానం లేదు. వాళ్ల నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం. రాష్ట్రాభివృద్ధి కోసం జనసేన స్పష్టమైన విధానంతో ఉంది. వచ్చేది కచ్చితంగా జనసేన-తెలుగుదేశం ప్రభుత్వమే. ఇందులో తిరుగులేదు. ఏపీ సుస్థిరత, సమైక్యత, సంపద ముందున్న లక్ష్యాలు. ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దాల్సిన పాలకులు రాష్ట్రానికి కనీసం రాజధాని ఎక్కడో కూడా తేల్చలేని పరిస్థితిలోకి నెట్టేశారు. రాజధాని ఏదీ అంటే ఐదు దిక్కులు ఒకరు.. మూడు దిక్కులు మరొకరు చూసే విచిత్ర పరిస్థితులున్నాయి. ఏపీ అభివృద్ధి దిశగా పయనించాలంటే అమరావతే రాజధానిగా ఉండాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కారిడార్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రాయలసీమ ప్రాంతాన్ని ఏవియేషన్, హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్, విద్యా, పారిశ్రామిక హబ్‌గా తయారు చేయాలి. కోస్తా ప్రాంతాన్ని సంప్రదాయ పంటలతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లకు కేంద్రం చేయాలి.’’ అని పవన్ అన్నారు.