ఏపీ పోలీసులు నాగార్జునసాగర్ డ్యామ్ నీటిని విడుదల చేయడాన్ని కేంద్రం పరిగణించింది. ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, కేఆర్‌ఎంబీ సీఈవోతో శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగర్ 13వ గేట్ నుంచి తమ భూభాగంలోనికి వస్తుందన్న వాదనతో అంగీకరించలేదు. ఈ సందర్భంగా ఏపీపై కేంద్రానికి తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఫిర్యాదు చేశారు. ‘‘తెలంగాణ పోలీసు యంత్రాంగమంతా అసెంబ్లీ పోలింగ్ విధుల్లో నిమగ్నమై ఉండగా... 29వ తేదీ అర్ధరాత్రి దాదాపు 1000 మంది ఏపీ పోలీసులు నాగార్జున సాగర్‌ను ఆక్రమించారని.. భద్రతా దళాలు ఉపయోగించే సీసీ కెమెరాలను, గేట్లను ధ్వంసం చేశారని తెలిపారు. దీనివల్ల హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది’’ అని శాంతి కుమారి తెలిపారు. దీంతో... సాగర్ వద్ద గత నెల 29వ తేదీ నాటికి ముందున్న పరిస్థితులను కొనసాగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి భల్లా ఆదేశించారు. ఇదే సమయలో.. నాగార్జున సాగర్‌తోపాటు శ్రీశైలం కూడా పూర్తిగా కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలోనికి వెళ్లిపోతుందని స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీ పూర్తి పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. మరోవైపు... శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన మరో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ సీఎ్‌సలు, జలవనరుల శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొంటారు.