రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శని, ఆదివారాలు(డిసెంబరు 2, 3) బీఎల్‌వోలు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమం చేపట్టింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌వోలు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దే ఉండేలా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మీ ఓటు... ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకపోయినా, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే మీ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి నేరుగా బీఎల్‌వోని కలిసి ఓటు గురించి తెలుసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన వారు కొత్త ఓటు కోసం ఫారం-6 దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో ఓటు లేని వారు, ఓటు తొలగించబడిన అర్హులు, ఓటుకు బీఎల్‌వో వద్దే ఫారం-6 తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు తెలియకుండానే మీ ఓటును ఓటరు జాబితా నుంచి తొలగించినా ఫిర్యాదు చేయవచ్చు. మీ ఓటు అక్రమంగా తొలగించడానికి కారకులైన వారిపై కూడా ఫిర్యాదులు చేయవచ్చు. లేదా మీకు తెలియకుండా మీ ఓటును మీ పోలింగ్ బూత్ పరిధి నుంచి వేరే పోలింగ్ బూత్‌కి మారినా వెంటనే ఫారం-8ను దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైతే ఓటర్ల జాబితా నుంచి అనర్హుల ఓట్లు తొలగించడానికి ఫారం-7 దరఖాస్తు చేయవచ్చు. ముసాయిదా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినా, అక్రమంగా ఓట్లు తొలగించినా, మీ బూత్ పరిధిలో లేని ఓటర్లును జాబితాలో చేర్చినా ఫిర్యాదులు నేరుగా బీఎల్‌వోకి చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌లో, ఎన్నికల సంఘం వెబ్‌సైట్లలో ఫిర్యాదు చేయవచ్చు. ముసాయిదా ఓటర్ల జాబితాపై దరఖాస్తులు, అభ్యంతరాలను డిసెంబరు 9వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం స్వీకరిస్తోంది. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ముందు వరకు కొనసాగుతూనే ఉంటాయి. అప్పటి వరకు నూతన ఓటర్ల నమోదుకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అప్పటి వరకు ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో లేదో తరచు చూసుకోవాలి. అక్రమంగా ఫాం-7 పెట్టి ఓటరు జాబితాలో మీ పేరు లేకుండా చేయడానికి అధికార పార్టీ యంత్రాంగం ఇబ్బడిముబ్బడిగా పని చేస్తోంది. అదేవిధంగా దొంగ ఓట్లను, తమకు అనుకూలమైన ఓట్లను ఓటర్ల జాబితాల్లో చేర్చడానికి గంపగుత్తగా ఆన్‌లైన్‌లో ఫారం-6లు దరఖాస్తులు చేయిస్తోంది. మీ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలో అర్హుల ఓట్లు తొలగకుండా, దొంగ ఓట్లు చేరకుండా నిరంతరం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్ల జాబితాల్లో మీ ఓట్లు ఉన్నాయా? లేవా? తరచి చూసుకోండి.