తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. కొండపై భక్తుల రద్దీ తగ్గిపోయింది. దర్శనం కోసం భక్తుల్ని నేరుగా క్యూలైన్ లోకి పంపిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు పదిరోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.శుక్రవారం 56,950 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 20,463 మంది తలనీలాలు సమర్పించారు.
స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.75 కోట్లు వచ్చాయి. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు గంట నుంచి 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. నవంబరు నెలలో 19.73 లక్షల మంది స్వామి వారి దర్శించుకున్నారు. 108.46 కోట్ల రూపాయలు హుండీ ద్వారా భక్తులు స్వామి వారికి సమర్పించారు. 97.47 లక్షల లడ్డూలను విక్రయించారు. 36.50 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
ఇప్పటికే ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేశారు. తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్లను కౌంటర్లలో అందజేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శన సమయంలో దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. డిసెంబరు 22 నుంచి 24 వరకు.. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు. ఈ సేవలను డిసెంబరు 25 నుంచి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు సహస్రదీపాలంకార సేవను కూడా ఏకాంతంగానే చేయనున్నారు.