అమరావతి: ప్రజల ఆరోగ్యాలు కాపాడే భావి డాక్టర్లు గంజాయికి బానిసలై ఉన్మాదులుగా మారి కొట్టుకుని ఆస్పత్రిలో పేషెంట్లు అయ్యారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా మారాయని ఆరోపించారు. మత్తుకు బానిసైన కొంతమంది మెడికోల హింసాప్రవర్తన చూశాక రాష్ట్రంలో పరిస్థితిపై భయమేస్తోందన్నారు. స్కూల్లో విద్యార్థులు గంజాయికి బానిసలు కావడం యువగళం పాదయాత్రలో చూశానని చెప్పారు. ఈ క్రమంలో యువత భవిత నాశనం అవుతుందనే ఆందోళనతో ఏపీలో డ్రగ్స్ దందాలను కట్టడి చేయాలని గతంలో ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు.
అయినా ఏపీలో గంజాయి తీవ్రత తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వద్దని చెప్పాల్సిన కొంతమంది వైద్య విద్యార్థులే డ్రగ్స్‌కు బానిసలయ్యారంటే.. ఇది చాలా ఘోరమైన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలకులు పట్టించుకోరని, ఇక ప్రజలే డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పిల్లలు మత్తుకి బానిసలు కాకుండా కాపాడుకుందామని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.