ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తుఫానుగా మారినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. దీనికి మిచౌంగ్ అనే పేరును సూచించారు. గత ఆరు గంటలుగా ఈ తుఫాను గంటకు 11 కి.మీ. వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోందని తెలిపింది. ప్రస్తుతం ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 350 కి.మీ., బాపట్లకు 250 కి.మీ., చెన్నైకు తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ప్రయాణిస్తుందని ఐఎండీ వెల్లడించింది. డిసెంబర్ 4 మధ్యాహ్నానికి తీరానికి చేరువగా వచ్చి.. ఆ తర్వాత దిశ మార్చుకుని దాదాపు ఉత్తరం వైపు కదులుతుందని వివరించింది.
డిసెంబరు 5 మధ్యాహ్నం దక్షిణ కోస్తా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో కోస్తా ఆంధ్రా, యానాంలో డిసెంబరు 4, 5 తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిస్తాయని హెచ్చిరించింది. అలాగే, డిసెంబరు 6న ఉత్తర కోస్తాలోని పలుచోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో డిసెంబరు 4,5 తేదీల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి సాధారణ వర్షం, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తుఫాను ప్రభావంతో డిసెంబరు 4 ఉదయం నుంచి 5 మధ్యాహ్నం వరకూ గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు డిసెంబరు 6 వరకూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.