ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుఫాన్ పై కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా గంటకు 13 కి.మీ వేగంతో మిచౌంగ్ తుఫాను కదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయినట్లు చెప్పారు. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించి రేపు మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా మారి తీరం దాటనున్నట్లు అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు.
కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాయలసీమలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసి, ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 80 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సాయంత్రానికి ఈదుర గాలుల తీవ్రత గంటకు 90-110 కి.మీ వేగం ఉంటుందని చెబుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.