మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. 2024లో 350 సీట్లకు పైగా గెలిచి మరలా మరోసారి ప్రధాని మోడీ అని మరోసారి రుజువు చేసిన ప్రజా తీర్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు. మోడీ ప్రభుత్వం విశ్వసనీయత, అవినీతి రహిత పాలన ఈ మూడు రాష్ట్రాల్లో ఘన విజయానికి కారణమన్నారు. మధ్యప్రదేశ్‌లో ఘన విజయానికి కారణం డబుల్ ఇంజన్ ప్రభుత్వమేనన్నారు. చత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపులో ప్రధాన పాత్ర మహిళలు, గిరిజనులదేనన్నారు.
తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం ఏడు నుంచి 14కు గణనీయంగా పెరిగిందని ఎంపీ వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్, అంచనాలకు అతీతంగా బీజేపీకి అనుగుణంగా జరిగిన నిశ్శబ్ద ఓటింగ్ అంటూ పేర్కొన్నారు. కచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 95 శాతానికి పైగా స్థానాలను బీజేపీ సాధించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హస్తం భస్మాసుర హస్తమని ఆయన ఆరోపించారు. త్వరలో ఇండియా కూటమి కార్యాలయాలు మూసేసుకోవచ్చు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత మాత్రమేనన్నారు.