గత 24 గంటల్లో గాజాలో 700మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ప్రభుత్వ మీడియా కార్యాలయ డైరెక్టర్ జనరల్ తెలిపారు. 15లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని చెప్పారు. వెస్ట్ బ్యాంక్‌లో రాత్రంగా కొనసాగిన దాడుల్లో 60మంది పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా హెబ్రాన్, బెత్లెహామ్, రమల్లా, నబ్లస్, జెనిన్ నగరాల్లో శనివారం ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఎలాంటి అభియోగాలు, విచారణ లేకుండానే పాలనాపరమైన నిర్బంధం పేరుతో వీరిని అరెస్టు చేశారు.
కాగా, గాజాపై దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇక ఇజ్రాయిల్‌తో చర్చలు పునరుద్ధరించేది లేదని హమస్ స్పష్టం చేసింది. దాడులు కొనసాగుతునే వున్నందున బందీలు-ఖైదీల మార్పిడి కోసం సంధి చర్చలు జరగబోవని తేల్చి చెప్పారు. హమస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఖతార్‌లో జరుగుతున్న చర్చల నుండి ఇజ్రాయిల్ వెనక్కి మళ్ళింది. ఈ నేపథ్యంలోనే హమస్ ప్రకటన కూడా వెలువడింది.
గాజాకు దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్‌లో నాజర్ ఆస్పత్రిలో దృశ్యాలు చూస్తుంటే అదంతా డెత్ జోన్‌లా మారిందని యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా థర్డ్ డిగ్రీ కాలిన గాయాలతో పిల్లలు నేలపై పడి వున్నారు. పదునైన ఆయుధాలు గుచ్చుకున్న గాయాలు, విరిగిన కాళ్లు చేతులు, తలకు దెబ్బలతో కనిపిస్తున్నారు. మృత్యుముఖంలో వున్న చిన్నారులను పట్టుకుని తల్లులు ఏడుస్తూ వుండడం చూస్తుంటే ఆ ప్రాంతమంతా మరణమృదంగం వినిపిస్తోందన్నారు.
ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణాలు ఒక ముప్పు అయితే, పెరుగుతున్న వ్యాధులు రెండో ముప్పుగా మారిందని జేమ్స్ పేర్కొన్నారు. తాగునీరు, పారిశుధ్యం, రక్షణ లేక అనేకమంది పిల్లలు మరణిస్తున్నారని అన్నారు. యుద్ధం ఆరంభమైన తర్వాత 6వేల మందికి పైగా పిల్లలు మరణించారని తెలిపారు. గాజాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ఒకదాంట్లో హెపటైటిస్ ఎ తలెత్తిందని యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ డైరెక్టర్ థామస్ వైట్ తెలిపారు. పారిశుధ్యం సరిగా లేనందున పలు వ్యాధుల ముప్పు పొంచి వుందన్నారు. పారిశుధ్యమనేది తీవ్ర సమస్యగా మారింది, చాలా ఇరుకుగా వున్న తరగతి గదుల్లో ప్రజలు ఇరుకిరుకుగా వుంటున్నారని దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు.
ఐక్యరాజ్య సమితి పాఠశాలల్లో నీటి సదుపాయం చాలా దారుణంగా వుందని, సగటున 125మందికి ఒక్కటే టాయిలెట్ వుందన్నారు.హెపటైటిస్-ఎ బాగా అంటు వ్యాధి. గల్ఫ్ సహకార మండలి సదస్సు మంగళవారం నుండి దోహాలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. గాజాలో పెరుగుతున్న సంక్షోభంపై సదస్సులో చర్చించనున్నారు. గాజాలో తక్షణమే యుద్ధాన్ని విరమించాలని అరబ్, ముస్లిం నేతలు ఒక సంయుక్త ప్రకటనలో పిలుపిచ్చిన మూడు వారాల తర్వాత పై సదస్సు జరగనుంది.