శ్రీకాకుళం జిల్లా, పలాస-కాశీబుగ్గలో శనివారం అర్ధరాత్రి ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... స్థానిక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రోడ్డులో నివాసముంటున్న జ్యూయలరీ వ్యాపారి తాళాసు శ్రీనివాసరావుకు పలాసకు చెందిన రేషన్ డీలరు తంగుడు వినోద్ కుమార్తె స్పందన (28)తో ఈ ఏడాది ఆగస్టు 30న వివాహం జరిగింది. ఈ జంట 15 రోజుల క్రితం హనీమూన్ కోసం హైదరాబాద్ వెళ్లి రెండు రోజుల క్రితం తిరిగి వచ్చింది. అయితే, స్పందనకు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో సమీపంలో ఉన్న ఏఎన్ఎం వచ్చి పరిశీలించింది. తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ఆమె సూచించింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. గ్యాస్ట్రిక్తో పాటు గుండెకు సంబంధించిన నొప్పులు రావడంతో ఆమె మృతి చెందినట్లు భర్త, ఆమె తండ్రి వినోద్ తెలిపారు. పెళ్లయిన మూడు నెలలకే స్పందన మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.