తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె టీడీపీ నందికొట్కూరు ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డితో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని టీడీపీ మ్యానిఫేస్టోను వివరించారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ.... ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. పన్నులు, చార్జీలు పెంచనని హామీలు గుప్పించిన జగన్ అధికారంలోకి రాగానే ప్రజలపై ఎడా పెడా బస్సు, కరెంట్ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా అమలయ్యాయన్నారు. రాబోయో ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటుహక్కు వినియోగించుకుని వైసీపీ తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన ఉమ్మడి సారధ్యంలో ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచిం చారు.