మిచాంగ్ తుఫాన్ రేపు(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కృష్ణా జిల్లా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కృష్ణా జిల్లాలో వరి పొలాలు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో రైతాంగం తల్లడిల్లుతోంది. తీరం వెంబడి వీస్తున్న ఈదురుగాలులు, వర్షాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆరబోసిన ధాన్యం రాశులపై పరదాలు కప్పుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. కోతలు కోసి మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం నీటి పాలు అవుతుందేమో అన్న భయం రైతుల్లో వ్యక్తమవుతోంది.