దేశంలో తీవ్ర విషాదాన్ని నింపిన ముంబై 26/11 ఉగ్రదాడుల ఘటనలో మాస్టర్ మైండ్ సాజిద్ మిర్‌పై విష ప్రయోగం జరిగినట్లు తెలిసింది. పాకిస్థాన్‌లోని డేరా ఘాజీ ఖాన్ సెంట్రల్ జైళ్లో ఉన్న సాజిద్ మిర్ మీద విష ప్రయోగం జరిగినట్లు సమాచారం. లష్కరే తోయిబా ఉగ్రవాది అయిన సాజిద్ మిర్ ముంబై ఉగ్రదాడులకు ప్లాన్ చేసి అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ప్రస్తుతం డేరా ఘాజీఖాన్ సెంట్రల్ జైళ్లో ఉన్న మిర్ మీద విష ప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI..మిర్‌ను విమానంలో తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బహవాల్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో సాజిద్ మిర్ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘటనపై మీద పాకిస్థాన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాజిద్ మిర్ జైళ్లో వంట చేస్తున్న వంటమనిషి పాత్రపైన విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన తర్వాత అతను కనిపించకుండా పోయినట్లు సమాచారం.
ఎవరీ సాజిద్ మిర్..?
లష్కరే తోయిబాలో చీఫ్ కమాండర్‌గా సాజిద్ మిర్ పనిచేశాడు. 2008 నవంబర్ 26న దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోకి పాకిస్థానీ ఉగ్రవాదులు ఆయుధాలతో చొరబడి మారణహోమం సృష్టించారు. నాటి ఘటనలో 175 మంది అమాయక జనం ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. పాకిస్తానీ అమెరికన్ అయిన దావూద్ గిలానీ అలియాస్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ సాయంతో ఈ ఉగ్రదాడికి సాజిద్ మిర్ ప్లాన్ చేశాడు. అయితే సాజిద్ మిర్ చనిపోయాడంటూ గతంలో నాటకాలు ఆడుతూ వచ్చిన పాకిస్థాన్.. అమెరికా ఒత్తిడితో గతేడాది సాజిద్ మిర్‌ను అదుపులోకి తీసుకుంది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమూద్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా ఉగ్రదాడులకు పాల్పడ్డాడనే కారణంతో 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
అయితే లాహోర్ సెంట్రల్ జైళ్లో ఉన్న సాజిద్ మిర్‌ను ఇటీవల డేరా ఘాజీ ఖాన్ సెంట్రల్ జైల్‌కు మార్చారు. తాజాగా అతనిపై విషప్రయోగం జరిగింది. మరోవైపు భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన టెర్రరిస్టులు కొంతమంది ఈ మధ్యకాలంలో అనూహ్యరీతిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. ఈ క్రమంలోనే సాజిమిర్ మీద విష ప్రయోగం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి ప్రపంచంలో ఉన్న చెడును తొలగిస్తున్నాడంటూ ట్విటర్‌లో నెటిజనం కామెంట్స్ పెడుతున్నారు.