ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిల్లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటిమునిగాయి. రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో ముందజాగ్రత్తగా వాటిని మూసివేశారు. చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.
తాంబ్రం ప్రాంతంలో నీటిలో చిక్కుకున్న 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడారు. బాసిన్ బ్రిడ్జ్, వ్యాసర్‌పాడి మధ్య 14వ నెంబరు వంతెనను అధికారులు మూసివేశారు. విద్యా సంస్థలతో పాటు న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ రైల్వే రద్దుచేసింది. చెన్నై-మైసూర్ శతాబ్ది, కోయంబత్తూర్- కోవై, కోయంబత్తూర్ శతాబ్ది, బెంగళూరు ఏసీ డబుల్ డెక్కర్, బెంగళూరు బృందావన్, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం రద్దు చేసినట్టు వెల్లడించింది. అలాగే, సబర్బన్ రైళ్లను కూడా రద్దు చేసినట్టు పేర్కొంది. చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వలసరవాకం 154 మి.మీ. నుంగంబాకంలో 101 మీ.మీ., చోలింగనల్లూరులో 125 మీ.మీ., కోడంబాకంలో 123 మీ.మీ., మీనంబాకంలో 108 మీ.మీ. వర్షపాతం నమోదైంది.
కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువల్లూరు జిల్లాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైలోని కాంతూరు ప్రాంతంలో గోడ కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కిల్పాకం మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఓపీ విభాగంలోకి వరద చేరింది. ముందుజాగ్రత్తగా మొత్తం 2,800 బస్సుల్లో కేవలం 600 మాత్రమే చెన్నై మెట్రో కార్పొరేషన్ తిప్పుతోంది. చాలా మంది సిబ్బంది విధులకు హాజరుకాలేదని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రైవేటు వాహనాల్లో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అటు, కోయంబత్తూరు- చెన్నై మధ్య రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. చాలా విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. ఇప్పటి వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించినట్లు తెలుస్తోంది.