ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆనకట్టల పునరుద్ధరణ, అభివృద్ధి ప్రాజెక్ట్ (డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ - డ్రిప్) కింద ఆంధ్రప్రదేశ్‌లో 667 కోట్లతో 31 డామ్‌ల పునరుద్ధరణకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ డ్రిప్ ఫేజ్ II కింద శ్రీశైలం, సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్, రావాడ రిజర్వాయర్, ఎర్ర కాలువ, ఏలేరు రిజర్వాయర్, పంపా రిజర్వాయర్. గుండ్లకమ్మ రిజర్వాయర్, రాళ్లపాడు ప్రాజెక్టు, సోమశిల రిజర్వాయర్, తమ్మిలేరు ప్రాజెక్టులు అలాగే డ్రిప్ ఫేజ్ III కింద గొట్టా బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్, కోనాం రిజర్వాయర్, ఆండ్ర రిజర్వాయర్, పెద్దేరు రిజర్వాయర్, కొవ్వాడ కాలువ ప్రాజెక్టు, జీఎంటీ జల్లేరు రిజర్వాయర్, ఆవుకు రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భైరవానితిప్ప ప్రాజెక్టు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గాజులదిన్నె సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి సుంకేసుల ప్రాజెక్టు, బ్రాహ్మణ సాగర్, వెలిగల్లు ప్రాజెక్టు, మైలవరం రిజర్వాయర్, చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ స్టేజ్ I, పెన్నా అహోబిలం ప్రాజెక్టుల పునరుద్ధరణ, అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపిందని వివరించారు. కేంద్రం ఆమోదించిన మొత్తం 31 ప్రాజెక్టుల్లో సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్టు, రైవాడ రిజర్వాయర్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ ప్రణాళికలను రూపొందించి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఆమోదం కోసం సెంట్రల్ వాటర్ కమిషన్‌కు సమర్పించినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టు స్క్రీనింగ్ టెంప్లేట్స్ తయారు చేయాల్సి ఉందని అన్నారు. డ్రిప్ ప్రోగ్రాం కింద పునరుద్ధరణ కోసం డామ్‌లను ఎంపిక చేసే బాధ్యత ఆయా రాష్ట్రాలు, ప్రాజెక్టును అమలు చేసే ఏజన్సీలదేనని మంత్రి తెలిపారు. డ్రిప్ II, III ఫేజ్ కింద ప్రతిపాదించిన జాబితాలో చిత్తూరులోని రాయల చెరువును రాష్ట్ర ప్రభుత్వం చేర్చలేదని మంత్రి తెలిపారు. 2021 నవంబర్లో వచ్చిన తుఫాను కారణంగా రాయల చెరువు డామ్‌కు లీకేజీ ఏర్పడి, బండరాళ్లు జారిపడినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మాణ పనులు చేపట్టి లీకేజీలను అరికట్టి తదుపరి నష్టాన్ని నివారించిందని అన్నారు. డామ్ దిగువన నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావాసం కల్పించారని తెలిపారు. తదుపరి డామ్‌కు ఎటువంటి నష్టం జరగలేదని నిర్ధారించుకున్న అనంతరం స్థానికులు తిరిగి తమ నివాస ప్రాంతాలకు సురక్షితంగా తరలి వచ్చారని తెలిపారు. రాయల చెరువు డామ్‌కు సంబంధించి శాశ్వత పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ 25.20 కోట్ల బడ్జెట్ తో ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందని అన్నారు.