మిచౌంగ్ తుఫాన్‌కు ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతంలోని 5 మండలాల్లో మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల కోసంరెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు వచ్చాయి. తీర ప్రాంతంలో 19 గ్రామాల్లోని ప్రమాదకరంగా ఉన్న ఇళ్లలో నివసిస్తున్న పలువురిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ ఈరోజు సెలవులు ప్రకటించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో 1077 కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తపట్నం, పాకల, చీరాల సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. కొత్తపట్నం సముద్ర తీరంలో దాదాపు 30 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. తీరం వెంబడి పడవలు కొట్టుకుపోకుండా రోడ్డుపైకి తీసుకువచ్చి సురక్షితంగా మత్స్యకారులు తాళ్ళతో కట్టారు. గంట గంటకూ అలల ఉధృతి పెరుగుతోంది.