ఆడుకుంటూ నాలుగేళ్ల చిన్నారి మహీ పొలంలో ఉన్న 25 అడుగుల బోరు బావిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అధికారలకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు ఆ పాపను రక్షించే పనిలో పడ్డారు. ఇంతలో ఈ విషయం కాస్త సీఎం దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే ఆపరేషన్ ముమ్మరం చేసి పాపను కాపాడాలని అల్టిమేటమ్ జారీ చేశారు. ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగడంతో అధికారులు రెస్క్యూ మిషన్‌ను మరింత ముమ్మరం చేశారు.
అలా 9 గంటల పాటు తీవ్రంగా శ్రమించి పాపను బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో మంగళవారం రోజున చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం పాపను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పాప మరణించడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి ప్రాణాలతో దక్కడంతో ఎంతో ఆనందించామని.. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని రెస్క్యూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.