నకిలీ మందుల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రాష్ట్ర చరిత్రలోనే క్యాన్సర్ నివారణకు ఉపయోగించే అతిపెద్ద నకిలీ మందుల తయారీ దారులను హైదరాబాద్ లోని మచ్చ బొల్లారంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి దాదాపు రూ.4.35 కోట్ల విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ మందులను స్వాధీన పర్చుకున్నామని డ్రగ్స్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్ వీ.బీ. కమలాసన్ రెడ్డి వెల్లడించారు.
ఆస్ట్రిక హెల్త్ కేర్ అనే కంపెనీ క్యాన్సర్ నివారణ కు ఉపయోగించే మందులకు సంబంధించి నకిలీ మందులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో ఈ నెల 2న డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్ ప్రత్యేక బృందాలు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. ఈ నకిలీ మందుల చలామణికి సంబంధించిన ఇన్వాయిస్ల ద్వారా పోస్టల్ శాఖ ద్వారా కంపెనీ చిరునామా కోసం ఆల్వాల్‌లో వెతకగా అది తప్పుడు చిరునామాగా నిర్దారణ అయింది. అనంతరం, ఐడీఏ చర్లపల్లి, నాచారం, మేడ్చల్‌లోని వివిధ కొరియర్ కార్యాలయాలను తనిఖీ చేసి ఆస్ట్రికా హెల్త్ కేర్ ద్వారా పంపిణీ అయిన వాటిని తనిఖీ చేశారు. డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్ ప్రత్యేక బృందం కీసరలోని ఆస్ట్రికా హెల్త్ కేర్ సంస్థపై దాడులు నిర్వహించింది.
‘ఆస్ట్రికా హెల్త్‌కేర్’ ప్రాంగణం నుంచి నకిలీ డ్రగ్ స్టాక్ డెలివరీ చేస్తున్న కొరియర్ బారుని డీసీఏ అధికారులు గుర్తించారు. మచ్చ బొల్లారం వద్ద మూడు షట్టర్లలో ఈ నకిలీ మందులు నిల్వ చేసి ఉన్నాయి. డిసెంబర్ 4న ఈ నకిలీ మందుల తయారీ లొకేషన్ పై దాడి చేసి రూ.4.35 కోట్ల విలువైన 36 రకాల క్యాన్సర్ నివారణ మందులు, ఇతర మందులను స్వాధీనం చేసుకున్నారు. మందుల లేబుల్స్ ఉనికిలో లేని కంపెనీ ‘ఆస్ట్రా జెనెరిక్స్ ప్రయివేటులిమిటెడ్’ వివరాలను కలిగి ఉన్నాయి. ఇవి 2021జూలైలో వీరి లైసెన్సులు ఇప్పటికే రద్దు చేయబడ్డాయి, కానీ తయారీ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌పై తేదీ మార్చి-2023 పేరుతో పేర్కొనడం గమనార్హం.