ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ...... వర్షాల నుంచి తెరిపి వచ్చింది. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా క్షేత్రస్ధాయిలో మంచిగా పనిచేశారు. అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి. చిన్న చిన్న విషయాల మీద ధ్యాస మిస్ కాకుండా చూసుకోవాలి. బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించండి. బాధితుల స్ధానంలో మనం ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సాయం వారికి అందాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. రూ.10 ఎక్కువ ఖర్చు అయినా.. బాధితులకు మంచి సహాయం అందాలి. ఆ దిశగా పనిచేయాలి. ప్రతి ఒక్కరి నోటా.. ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్ బాగా చేశాడన్న మాట వినిపించాలి. వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలి. పరిహారం అందించడంలో సానుభూతితో ఉండండి అని అన్నారు.