ఏపీలో వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో దళితులపై 6 వేలకు పైగా దాడులు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎం.ఎస్ రాజు తెలిపారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 150 మందికి పైగా దళితులు హత్యకు గురయ్యారు. దళిత దీనజనోద్ధారకుడిలా ఊదరగొట్టే జగన్ పాలనలో వారానికి 4 గురు హత్యలకు, 6 గురు హత్యాయత్నాలకు, రోజుకు ఇద్దరు దాడులకు, వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడుల్లో ఏపీ దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. నేరాల్లో దేశంలో ఏపీ 7వ స్థానంలో ఉంది. దళితులపై దాడులకు సంబంధించి కేంద్ర నేరగణాంక సంస్థ తెలిపిన వివరాలపై, టీడీపీ చెబుతున్న లెక్కలపై సాక్షికి అనుమానం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దళిత-గిరిజనులపై వైసీపీకు, సాక్షి యాజమాన్యానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా దీనిపై స్పందించాలని ఎం.ఎస్ రాజు డిమాండ్ చేశారు.