ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారిక, పార్టీ కార్యక్రమాలు కలిపి నిర్వహిస్తున్నారని మాజీ ఎస్‌ఈసీ, సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ఏపీ గవర్నర్‌ను సిటిజన్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వ నిధులను పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని గవర్నర్‌ను కోరాం. జీవో 7 తెచ్చి ‘‘వై ఏపీ నీడ్స్ జగన్’’ కార్యక్రమం తెచ్చారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా చాలా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటివి జరగకుండా గవర్నర్ సరిచూడాలి. ఒకరికి ఒకే ఓటు ఉండాలన్న అధికార పార్టీ ప్రతిపాదనను మేమూ స్వాగతిస్తున్నాం. చాలా మందికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఈ విషయంలో సంస్కరణలు తేవాల్సి ఉంది. ఒకరికి ఒకటే ఓటు ఉండాలనేదే మా అభిప్రాయం కూడా’’ అని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.