యువత ఉత్కంఠకు తెర దించుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటీపీఆర్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఫిబ్రవరి 25వతేదీన ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ సైతం ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్ లేదా సీబీటీలో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.