తిరుమల శ్రీవారిని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దర్శించుకున్నారు. ఇవాళ వేకువ జామున స్వామి వారి సుప్రభాత సేవలో లాలూ ప్రసాద్, ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆయన తనయుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులను చాలా కాలం తర్వాత అందుకున్నామన్నారు లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్. తన కుమార్తెకు తలనీలాలు సమర్పించామని.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ డిఫ్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌కు రేణిగుంట విమానశ్రయంలో ఘన స్వాగతం లభించింది. లాలూ ఫ్యామిలీకి భారీ గజమాలలు, డప్పు చప్పులతో స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు.