శ్రీకాకుళం జిల్లా గార ఎస్‌బీఐలో బంగారం వ్యవహారంలో క్లారిటీ వచ్చింది. బ్యాంకులో ఉద్యోగులే బంగారాన్ని మాయం చేశారని తేలింది. ఈ బంగారాన్ని మాయం చేయడంలో కీలక సూత్రధారి కిరణ్‌బాబు అని తేల్చారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ బ్యాంకులో డిప్యూటీ మేనేజరుగా పనిచేస్తున్న స్వప్నప్రియ.. అదే బ్యాంకులో పనిచేస్తున్న తన సోదరుడు కిరణ్‌బాబుతో కలిసి స్థిరాస్తి వ్యాపారం, రైస్ పుల్లింగ్, షేర్ మార్కెట్‌లలో డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోయారు. ఆ సమయంలో వీరికి తిరుమలరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయనకు ఎక్కువ కమీషన్ ఇస్తామని చెప్పి.. బ్యాంక్ క్యాషియర్ సురేష్ సహకారంతో బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలను బయటకు తీసుకొచ్చేవారు.
తిరుమలరావు ద్వారా ఈ బంగారాన్ని ఇతర బ్యాంకుల్లో కుదువ పెట్టి అప్పు తీసుకునేవారు. అలా కిరణ్‌బాబు, అతని స్నేహితుడు రాజారావు 2022 సెప్టెంబరులో తొలిసారి 100 గ్రాముల ఆభరణాలు తిరుమలరావుకు ఇచ్చారు. వాటిని శ్రీకాకుళంలోని ఫెడరల్ బ్యాంకులో పెట్టి రూ.4 లక్షలు లోన్ తీసుకున్నారు. అందుకు స్వప్నప్రియకు రూ.3 వేలు కమీషన్‌గా ఇచ్చారు. ఇలా ఆమె ఇచ్చిన బంగారాన్ని వారిద్దరు తిరుమలరావుకు పంపారు. వాటిని శ్రీకాకుళంలోని ఫెడరల్ బ్యాంక్, అరసవల్లి, ఆమదాలవలసల్లోని సీఎస్‌బీ శాఖల్లో వేర్వేరు వ్యక్తుల పేరిట పెట్టి రుణం తీసుకున్నారు. ఇందులో తిరుమలరావు మావయ్య మోహన్ చంద్, సీఎస్‌బీ ఉద్యోగులు గణపతిరావు, కరకల తారకేశ్వరరావు, మార్పు వెంకట రమేష్ వారికి సహకరించారు.
స్వప్నప్రియ, కిరణ్‌బాబు, రాజారావు చెప్పిన వ్యక్తులకు నగదును జమ చేసేవారు. ఇలా రూ.4 కోట్ల వరకు నగదు వివిధ రూపాల్లో బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియపై అనుమానం వ్యక్తం చేస్తూ మేనేజరు సీహెచ్ రాధాకృష్ణ లాకర్‌లోని బంగారం తనిఖీ చేయగా 86 బంగారు సంచులు మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే శ్రీకాకుళం ఆర్‌ఎంకు ఫిర్యాదు చేశారు. ఆమెను ప్రశ్నించగా.. తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, అందుకే ఇలా చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత 26 సంచులను రాజారావు ద్వారా తిరిగి అప్పగించారు. వీరు బ్యాంకు ఖాతాదారులు ఆభరణాలు కుదువ పెట్టిన తర్వాత ఆరు నెలల వరకు వాటి కోసం వెళ్లేవారు కాదు. ఈ విషయం గమనించి ఆ దశలోనే ఆ బంగారాన్ని వేరే చోట్ల తాకట్టు పెట్టేవారు.
ఒక వేళ ఎవరైనా ఖాతాదారులు వచ్చి తమ బంగారం చూపించమని అడిగితే.. సాంకేతిక సమస్య ఉందని.. మళ్లీ రేపు రావాలని సూచించేవారు. ఇంతలో ఇతర బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని తీసుకువచ్చి మరుసటి రోజు వారికి చూపించి నమ్మించేవారు. ఈ కేసులో ఉరిటి స్వప్నప్రియ ఆత్మహత్యకు పాల్పడగా.. మిగిలిన నిందితులు పొన్నాడ తిరుమలరావు, ఉరిటి కిరణ్‌బాబు, నంబాన రాజారావు, కొండల గణపతిరావు, కాకర్ల తారకేశ్వరరావు, మార్పు వెంకట రమేష్, మొదలవలస మోహన్ చంద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.